'వెయ్యి శాతం మాదే గెలుపు'

'వెయ్యి శాతం మాదే గెలుపు'

'నేను చెబుతున్నా రాసుకోండి.. నూటికి వేయి శాతం టీడీపీ గెలవబోతోంది' అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోనూ ఇదే తరహాలో వైసీపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చారని గుర్తుచేశారు. సర్వేలు చేసుకోవడం అందరికీ అలవాటుగా మారిందన్న బాబు.. టీడీపీకి 1983 నుంచి సర్వేలు చేయిస్తోందన్నారు. తాను చెప్పగానే మధ్యాహ్నం నుంచి ఓటర్లు వచ్చి క్యూలైన్లలో నిల్చున్నారని.. పక్క రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ఆంధ్రులు కూడా ఓటేయడానికి వచ్చారని అన్నారు.

వీవీ ప్యాట్ల వ్యవహారంపై..

ఈవీఎంల విషయంలో సీఈసీగా పని చేసిన వ్యక్తులే తప్పు పడుతున్నారని బాబు చెప్పారు. వీవీ ప్యాట్ల లెక్కింపులో తేడా జరిగితే నియోజకవర్గం మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్‌ చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో ఇంకా చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని ఈసీ పరిష్కరించాలని బాబు కోరారు. ఈవీఎంల సమస్య పరిష్కారమయ్యేవరకు పోరాడతామన్న బాబు.. ఈవీఎంలపై తమ వాదనను అంగీకరించడానికి బీజేపీకి ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు.  ఇంతటి అనుమానాలు వచ్చేలా చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.