బీజేపీకో రూలు.. మాకో రూలా..?

బీజేపీకో రూలు.. మాకో రూలా..?

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ నేతలు, అమిత్‌ షా ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ఈసీ.. తృణమూల్ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదులను విసర్మరించడం ఆందోళనకరమైన విషయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బీజేపీయేతర పార్టీల ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నప్పటికీ కావాలనే చర్యలు చేపట్టకపోవడం వంటివన్నీ కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై అనుమానాలను స్పష్టంగా రేకెత్తిస్తోందన్నారు. నరేంద్ర మోడీకి పదేపదే క్లీన్ చిట్ ఇచ్చే ఈసీ.. బీజేపీ చేసిన తప్పుడు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం దారుణమని బాబు అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలు ఎన్నికల సంఘం చిత్తశుద్ధినే సందేహాస్పదంగా చేస్తోందన్నారు.

ప్రతిపక్షాలు చేసే ఫిర్యాదులపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల సంఘం విశ్వసనీయతను నిరూపించుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 50% వీవీ ప్యాట్లను లెక్కించాలని ప్రతిపక్షాలు 22 ఉమ్మడిగా విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోకపోవడం మరీ దారుణమని అభిప్రాయపడ్డ బాబు.. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఇది అని అన్నారు.