ఆ బాధ్యత ప్రభుత్వానిదే: బాబు

ఆ బాధ్యత ప్రభుత్వానిదే: బాబు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలిపారు. ఉండవల్లిలో బాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గత 15 రోజుల్లో అనంతపురం, ప్రకాశం, గురజాల, నరసరావుపేట, వినుకొండల్లో పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని  అసహనం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. 

ఇక.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని..తన కంటే ఎమ్మెల్యేల వాయిస్‌ ఎక్కువగా వినబడాలని ఆయన ఆకాంక్షించారు. టీడీపీ హయాంలో అమలుచేసిన రుణమాఫీ 4, 5 విడతలు చెల్లించడం ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత అని అభిప్రాయపడిన బాబు.. 10శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. 'వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశాం. మిగిలినవి చివరిదశకు చేరాయి. వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నారు, పనులు నిలిపివేస్తున్నారు' అని బాబు అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేకపోవడం, చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద జల్లడమే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందని బాబు అభిప్రాయపడ్డారు.