స్పెషల్ ఇంటర్వ్యూ : రుహాని శర్మ - సౌత్ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్ !

స్పెషల్ ఇంటర్వ్యూ : రుహాని శర్మ - సౌత్ సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్ !

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన సినిమా 'చి.ల.సౌ'.  ఈ చిత్రంతో రుహని శర్మ కథానాయకిగా పరిచయం కానుంది.  ఆగష్టు 3న ఈ సినిమా విడుదల సందర్బంగా ఆమెతో జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం... 

మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి ?

నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను.  పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను.  వాటిలో దీపికా పదుకొనేతో కలిసి చేసిన పారాచ్యూట్ యాడ్ కూడా ఉంది.  

ఈ సినిమా ఆఫర్ మీకెలా వచ్చింది ?

నిర్మాతలు నేను చేసిన యాడ్స్, నా ఫోటోలు చూసి నన్ను ఆడిషన్స్ కు పిలవడం జరిగింది.  డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ నన్ను ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశారు. 

మీరు ఈ సినిమాకు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ?

ఈ సినిమాకు సైన్ చేయడానికి ముఖ్య కారణం స్టోరీ.  కథ చాలా బాగుంటుంది.  వినగానే ఒప్పేసుకున్నాను.  నా పాత్రలో నటనకు మంచి స్కోప్ ఉండటం కూడా ఒక కారణమే. 

మీ పాత్ర గురించి కొంచెం వివరంగా చెప్పండి ?

ఇందులో నేను చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తాను.  మంచి విలువలున్న పాత్ర.  సహజంగా కూడ ఉంటుంది.  అందరికీ నచ్చేలా ఉంటుంది. 

సుశాంత్ తో కలిసి నటించడం ఎలా ఉంది ?

సుశాంత్ చాలా జెంటిల్.  ఫ్రెండ్లీగా ఉంటాడు.  హార్డ్ వర్కింగ్.  అతనితో కలిసి నటించడం నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. 

ఇక మీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి మీ అభిప్రాయం ?

రాహుల్ మంచి దర్శకుడు.  షూటింగ్ కు ముందే అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటాడు.  ఏం తీయాలో అతనికి బాగా తెలుసు.  నన్నొక స్నేహితురాలిగా ట్రీట్ చేసేవాడు. 

మీకు తెలుగు రాదు కదా ఎలా మేనేజ్ చేశారు ?

అవును నాకు తెలుగు పెద్దగా రాదు.  మొదట్లో కొంచెం కష్టంగానే అనిపించింది.  కానీ సెట్లో అందరూ నాకు సహాయపడ్డారు.  అన్ని డైలాగ్స్ నాకు అర్థమయ్యేలా వివరించేవారు.  ఒకసారి అర్థం కాకపొతే మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. 

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ?

పర్టిక్యులర్ ప్లానింగ్ అంటూ ఏం లేదు.  మంచి కథల్ని సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ ఉండాలనేదే నా ఆలోచన. 

టాలీవుడ్ వాతావరణం ఎలా అనిపిస్తోంది ?

చాలా బాగుంది.  ఐ లవ్ ఇట్.  మొదటి నుండి దక్షిణాది సినిమాలకు నేను పెద్ద ఫ్యాన్.  తరచూ ఇక్కడి సినిమాలు చూస్తూనే ఉంటాను.  ఇక్కడి వాతావరణం, మనుషులు నాకు బాగా నచ్చారు. 

మీకు ఏదైనా డ్రెన్ రోల్ ఉందా ?

ఉంది.  ఎప్పటికైనా వారియర్ రోల్ చేయాలనేది నా ఆశ.  చూడాలి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో. 

ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకునే అంశాలేవి ?

సినిమా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.  అంటే ఏదో పెద్ద కథలా కాకుండా సింపుల్ గా, అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది.  పాత్రలు కూడ అంతే.  తప్పకుండా ఈ అంశాలు అందరికీ నచ్చుతాయి. 

చివరగా తెలుగు ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ?

ఇది నా మొదటి సినిమా.  అందరూ చూడండి.  మీకు తప్పక నచ్చుతుంది.  మీ అందరి సపోర్ట్ నాకు, మా సినిమాకు కావాలి.  ప్లీజ్ డూ వాచ్.