ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్ట్..!?

ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్ట్..!?

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ, ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమా? సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించే అకాశం లేదా? ఇప్పుడు అందిరినీ ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఐఎన్‌ఎక్స్ మీడియా వ్యవహారం నుంచి చిదంబరం సులబంగా బయటపడే అవకాశం లేదనే అనిపిస్తోంది. ఈ ఉదయం సుప్రీంకోర్టులో చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ చిదంబరం తరపు లాయర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. దీంతో ప్రధాన న్యాయమూర్తి ముందుకు ముందస్తు బెయిల్ వ్యవహారం వెళ్లింది.

అయితే, అయోధ్య కేసు వాదనల్లో బిజీగా ఉన్నారు సీజేఐ. ఆయన నిర్ణయం తర్వాత చిదంబరం బెయిల్ పిటిషన్ వ్యవహారం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు దేశం విడిచి వెళ్లకుండా చిదంబరంపై లుకౌట్ నోటీసులు జారీఅయ్యాయి. ఈ ఉదయం చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ రమణ ఎదుట కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే తీర్పు ఇవ్వడానికి నిరాకరించారు జస్టిస్ రమణ.. దీనిపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఐఎన్‌ఎక్స్ వ్యవహారంలో చిదంబరాన్ని వ్యక్తిగతంగా ప్రశ్నించాల్సిందే అంటున్న ఈడీ, సీబీఐ.. అయోధ్య కేసు వాదనలో చీఫ్ జస్టిస్ బిజీగా ఉన్నందున ఇవాళ చిదంబరం పిటిషన్‌పై ఎంత వరకు నిర్ణయం తీసుకుంటారన్నదే అనుమానమే. మరోవైపు చిదంబరానికి పూర్తిగా మద్దతు ఉంటుందని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా ఇది కక్ష్యసాధింపు చర్యే నంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అయితే, ప్రస్తుతం చిదంబరం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనే విషయం తెలియడంలేదు. మరోవైపు, సీబీఐ, ఈడీ అధికారులు.. నిన్నటి నుంచి చిదంబరం నివాసం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయన కనిపిస్తే అరెస్ట్ చేయడం ఖాయమనే చర్చ సాగుతోంది.