కరోనా జ్ఞానోదయం : ఇక చైనాలో ఆ మాంసం నిషేధం ?

కరోనా జ్ఞానోదయం : ఇక చైనాలో ఆ మాంసం నిషేధం ?

కరోనా దెబ్బకు చైనాకి జ్ఞానోదయం అయినట్టుంది. చైనాలో విజృంభించిన కొవిడ్‌-19‌ వైరస్‌ ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి ఇప్పటిదాకా మొత్తం 2,705 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80000 మంది ఈ వైరస్ తో బాధపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చైనాలో కొత్తగా  మరో 508 కేసులను ఆ దేశ NHC (జాతీయ ఆరోగ్య కమిషన్‌) నిర్థారించింది. వీటిలో తొమ్మిది కేసులు మినహా మిగతావన్నీ హుబెయ్‌ ప్రావిన్స్‌ లోనే నమోదు కావడం అక్కడి తీవ్రతకు అద్ధంపడుతోంది.

చైనాలో నిన్న ఒక్కరోజే 71 మంది మృత్యువాత పడ్డారు. హుబేయి ప్రావిన్స్‌లో లక్షలాది మంది ప్రజలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. హుబెయ్‌ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో నిర్బంధ ఆంక్షలు సడలించిన కొద్ది సేపటికే మళ్లీ ఉపసంహరించుకున్నారు. కరోనా మహమ్మారి వణికిస్తుండటంతో చైనా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా అక్కడ ఎటువంటి జంతువులను అయిన తినే స్వేఛ్చ ఉండగా ఇప్పుడు వన్యప్రాణుల మాంసం వినియోగం, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. తమ దేశ పౌరుల ప్రాణాల్ని బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే బిలియన్ల డాలర్ల పరిశ్రమపై నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.