ప్రధాని మోడీ బలహీనుడు, జీ జిన్ పింగ్ అంటే భయం

ప్రధాని మోడీ బలహీనుడు, జీ జిన్ పింగ్ అంటే భయం

పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించే ప్రతిపాదనను చైనా మరోసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మోకాలడ్డింది. చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం ఇది నాలుగోసారి. కానీ ఈ సారి భద్రతా మండలిలోని సభ్యదేశాలు ఇతర ప్రత్యామ్నాయాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు రువ్వే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జార విడవలేదు. గురువారం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రధానిపై ఘాటైన విమర్శలు చేశారు. మోడీ బలహీనుడని, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ అంటే ఎక్కడా లేనంత భయపడతారని వ్యాఖ్యానించారు. చైనాకు వ్యతిరేకంగా మోడీ నోటి వెంట ఒక్క మాటైనా రాదని రాహుల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ తన ట్వీట్ లో ‘బలహీనుడైన మోడీ జీ జిన్ పింగ్ అంటే భయపడుతున్నారు. చైనా భారత్ కు వ్యతిరేకంగా ఏదైనా చర్య చేపట్టినా ఆయన నోటి వెంట ఒక్క మాటైనా పెగలదు. 

చైనాతో మోడీ దౌత్యనీతి:

గుజరాత్ లో జీ తో కలిసి ఊయల ఊగడం
ఢిల్లీలో జీని కౌగిలించుకోవడం
చైనాలో జీ ముందు సాగిలపడటం

చైనా మోకాలడ్డిన తర్వాత ఈ పరిణామంపై విదేశాంగ మంత్రిత్వశాఖ చాలా నిరాశ చెందినట్టు ప్రకటించింది. ‘మేం తీవ్ర నిరాశ చెందాం. కానీ మేము అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల ద్వారా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాం. భారతీయ ప్రజలపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను కచ్చితంగా న్యాయస్థానం ఎదుట నిలబెట్టేందుకు కృషి చేస్తాం. ఈ ప్రతిపాదన తెచ్చిన సభ్యదేశాలకు, బలపరిచిన ఇతర  సభ్యదేశాలకు, సభ్యత్వం లేని దేశాలకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం‘ అని తెలిపింది. చైనా పేరు ప్రస్తావించకుండా కమిటీలో అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలన్న ప్రతిపాదనను ఒక దేశం అడ్డుకోవడంతో నిర్ణయం తీసుకోలేక పోయారని విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పింది.