సైనికుల సంఖ్యను సగానికి తగ్గించిన చైనా

సైనికుల సంఖ్యను సగానికి తగ్గించిన చైనా

సైనిక బలంతో సరిహద్దు దేశాలతో పాటు పశ్చిమ దేశాలను సైతం బెంబేలెత్తించిన చైనా ఇక తన సైనికుల సంఖ్యను దాదాపుగా సగం తగ్గించింది. చైనా ఎందుకు హఠాత్తుగా తన సైన్యాన్ని 50%కి తగ్గించింది? నేవీ, ఎయిర్ ఫోర్స్ ను బలోపేతం చేసేందుకు చైనా తన సైనికుల సంఖ్యను తగ్గించినట్టుగా చెబుతున్నారు. ఇదంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని ఆధునిక బలంగా మార్చేందుకు వేసిన సరికొత్త వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. 

జిన్హువా వార్తాసంస్థ కథనం ప్రకారం 20 లక్షలు ఉండే చైనా మిలటరీ నేవీ, ఎయిర్ ఫోర్స్ లను ఏకీకృతం చేసుకొని మరింత బలంగా తయారయ్యేందుకు తంత్రాలు రచిస్తోంది. ఇందుకోసం సైనికుల సంఖ్యను 50% తగ్గించుకొంటోంది. పీఎల్ఏ చేపట్టిన ఈ మార్పును తెలియజేస్తూ ఆదివారం ప్రచురించిన ఓ రిపోర్టులో ‘పీఎల్ఏ చరిత్రలో ఇది కనీవినీ ఎరుగని మార్పు. పీఎల్ఏ సంఖ్యను ఆర్మీ 50% తగ్గించనుంది. ఇది మన నాన్-కంబాట్ యూనిట్ లో దాదాపుగా సగం. పీఎల్ఏ అధికారుల సంఖ్యను 30% తగ్గించారని’ పేర్కొంది.

అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రారంభించిన మిలటరీ సంస్కరణల్లో భాగంగా పీఎల్ఏ కొన్నేళ్లుగా తన సైనికుల సంఖ్యను తగ్గించింది. అయినప్పటికీ 20 లక్షల సైనికులతో పీఎల్ఏ ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద సైనికశక్తిగా గుర్తింపు పొందింది. రిపోర్ట్ ప్రకారం పీఎల్ఏకి చెందిన నాలుగు ఇతర విభాగాలు-నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ ల సంఖ్య చైనా మిలటరీ బలంలో సగంగా ఉంది. కొన్నేళ్లుగా నేవీ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను రంగంలోకి దించిన చైనా మరో యుద్ధవిమాన వాహక నౌకపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. మూడో క్యారియర్ ను తయారు చేస్తోంది. అధికారిక మీడియా రిపోర్ట్ ప్రకారం చైనా ఐదారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేయనుంది. రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ ముఖ్యంగా మిస్సైల్ వార్ ఫేర్ పై దృష్టి పెడుతున్నాయి.

చైనా సరిహద్దుల్లో శత్రు సైనికులతో పోరాటంలో నేవీ, ఎయిర్ ఫోర్స్, మిస్సైల్ యూనిట్లు ప్రధాన పాత్ర పోషించనున్నాయని షాంఘై మిలటరీ నిపుణుడు నీ లెక్యాంగ్ తెలిపారు. వాయు, ఆకాశ, సైబర్ స్పేస్ లలో ఆధునిక యుద్ధతంత్రాలను ఎదుర్కోవాల్సి వస్తుండటంతో సైనిక బలగాల ప్రాధాన్యత తగ్గుతోంది. ‘చైనా సైనికులు రెండో ప్రపంచ యుద్ధకాలంలో తయారైన మోడల్ ను అనుసరించి పనిచేస్తున్నారని’ ఆయన చెప్పారు. పీఎల్ఏలో ఉన్న అనేక మంది అధికారులకు పదోన్నతి కల్పించడమో లేదా తొలగించడమో చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చైనా మిలటరీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ ఐదు స్వతంత్ర వ్యవస్థలుగా ఉన్నాయి. సైబర్, స్పేస్, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ను స్ట్రాటజిక్ సపోర్ట్ పర్యవేక్షిస్తుంది. సైన్యం ఆధునీకరణలో భాగంగా అధ్యక్షుడు జీ మూడేళ్ల కిందటే రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ లను ఏర్పాటు చేశారు.