పవన్‌పై చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు

పవన్‌పై చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ, ఆంధ్రా ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచార సభల్లో పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానిస్తున్నారని సినీ రచయిత చిన్నికృష్ణ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తెలంగాణలో సంతోషంగా బతుకుతున్నామని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని.. అసలు ఆయన సిద్ధాంతమేంటో చెప్పాలన్నారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దన్న చిన్నికృష్ణ.. రాజకీయమంటే త్రివిక్రమ్‌ రాసిన డైలాగులు చెప్పడం కాదని అన్నారు. 

ఇక.. కాపు సామాజికవర్గ నేతలకు టికెట్లు ఇచ్చి పవన్‌ డబ్బులు వసూలు చేస్తున్నారని చిన్నికృష్ణ ఆరోపించారు. కులం పేరుతో కాపుల మధ్య పవన్‌ చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, జగన్‌లను తిట్టే అర్హత పవన్‌కి లేదని.. వాళ్ల దగ్గర పవన్ రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీపై ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటే బాధ్యులెవరని ప్రశ్నించారు చిన్నికృష్ణ. 

అజ్ఞాతవాసి సినిమా తీసినప్పుడే పవన్ కల్యాణ్ తెలివి ఏంటో తెలిసిందని ఎద్దేవా చేశారు. కాపు కులం అంటే మెగాస్టార్ ఫ్యామిలీ మాత్రమే కాదన్న చిన్నికృష్ణ.. ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని నమ్మి వెంట వచ్చిన ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. జగన్‌ను ఒంటరి చేసి ఆడుకుందాం అనుకుంటే కుదరదని.. జగన్ వెంట తామున్నామని చెప్పారు. కచ్చితంగా వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.