'మా' క్రమశిక్షణా కమిటీకి చిరంజీవి రాజీనామా!?

'మా' క్రమశిక్షణా కమిటీకి చిరంజీవి రాజీనామా!?

రెండేళ్ళ క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. 2019 మార్చి10న ఎన్నికలైతే, 11వ తేదీ ఉదయం ఫలితాలు వచ్చాయి. శివాజీరాజా ప్యానల్ పై నరేశ్ ప్యానెల్ జయకేతనం ఎగరేసింది. నరేశ్ అధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా, రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

మూడునాళ్ళ ముచ్చట!

కాపురం చేసే కళ కాలిగోళ్ళు తీసేప్పుడే తెలిసి పోతుందంటారు. కొత్తగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నరేశ్ తో కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ విభేదించారు. నరేశ్ ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా తనకు నచ్చినట్టుగా చేసుకుపోతున్నారని విమర్శించారు. అయితే... చిత్రంగా ఆ వివాదాలు ఒకే ప్యానల్ నుండి గెలిచిన నరేశ్, రాజశేఖర్ మధ్య తలెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నరేశ్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన రాజశేఖర్, జీవిత 'మా' కార్యక్రమాలకు దూరమయ్యారు. నరేశ్ సైతం తన టీమ్ తోనే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. 

డైరీ ఆవిష్కరణలో పీక్స్ కు చేరిన రచ్చ!

చూస్తుండగానే 2020వ సంవత్సరం వచ్చేసింది. రెండుగా విడిపోయిన 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరినీ చిరంజీవి, మోహన్ బాబు వంటి వారు బుజ్జగించి, 'మా' డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. అయితే... ఆ వేదిక మీదనే కొన్ని నెలలుగా అసంతృప్తితో ఉడికిపోతున్న రాజశేఖర్ గొంతు విప్పారు. ఏకంగా చిరంజీవి, మోహన్ బాబులనే టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు. 'మా'లో ఎన్నో లోపాలు ఉన్నా... 'ఆల్ ఈజ్ వెల్' అన్నట్టుగా వ్యవహరించడం తనవల్ల కాదని స్పష్టం చేశారు. అంతేకాదు... ఆ కార్యక్రమం నుండి రాజశేఖర్ వాకౌట్ చేశారు. రాజశేఖర్ చర్యలతో వేదిక మీద అతిథులు నొచ్చుకున్న విషయాన్ని గ్రహించిన జీవిత... వారిని కొంత శాంతపరిచే ప్రయత్నంచేశారు.

సీనియర్స్ తో క్రమశిక్షణా సంఘం!

'మా'లో వివాదాలు పీక్స్ కు చేరడంతో సీనియర్ నటుడు కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలతో ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పడింది. తనపై ఆ సంఘం చర్యలు తీసుకుంటుందని గ్రహించిన రాజశేఖర్ ముందే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. దాంతో 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ... నరేశ్ వర్గంగా, జీవిత వర్గంగా చీలిపోయింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలను ఎక్కుపెట్టాయి. కొద్ది రోజులు నరేశ్ 'మా' అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటే, ఉపాధ్యక్షుడిగా ఉన్న బెనర్జీ ఆ స్థానంలో విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత ఏర్పడక ముందే కరోనా వచ్చేసింది. దాంతో 'మా' సభ్యులందరినీ చూసుకునే పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే అదే సమయంలో చిరంజీవి చొరవ చూపి, 'కరోనా ఛారిటీ కమిటీ' పేరుతో 'మా'తో పాటు మిగిలిన ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులనూ ఆదుకునే పనిచేశారు.

ఈ యేడాది డైరీనే లేదు!

గత యేడాది డిసెంబర్ నాటికి పరిస్థితులు కొంతమేరకు సర్ధుకున్నాయి. సినిమా షూటింగ్స్ మొదలయ్యాయి. కానీ 'మా'లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. ఎన్నో ఏళ్ళుగా 'మా' జనవరి నెలలో డైరీని పబ్లిష్ చేస్తూ వస్తోంది. ఈ యేడాది అది కూడా జరగలేదు. ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. డైరీ విడుదల కాకపోయినా... ఇప్పుడు మార్చిలో 'మా' ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండేళ్ళ క్రితం ఇదే మార్చి 10న ఎన్నికలు జరిగాయి. కానీ 'మా'లో ఏం జరుగుతోందో ఆ భగవంతుడికి కూడా తెలుస్తున్నట్టు లేదు. 

'మా'పై కినుక వహించిన చిరు!

ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి 'మా' క్రమశిక్షణా సంఘానికి రాజీనామా చేశారని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. కృష్ణంరాజు ఆరోగ్యం అంతగా బాగుండకపోవడంతో ఇల్లు దాటి బయటకు రావడం లేదు. అలానే ఇటు మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ సైతం పబ్లిక్ యాక్టవిటీస్ లో పాల్గొనడం లేదు. ఎటొచ్చి... చిరంజీవి ఒక్కరే కాస్తంత యాక్టివ్ గా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు కాడి తీసి కిందపడేసి... మా'కు దూరంగా  జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి 'మా'ను ఇప్పుడు ఎవరు గాడిన పెడతారో చూడాలి!!