హాట్ టాపిక్ గా మారిన చిరు-విజయశాంతి

హాట్ టాపిక్ గా మారిన చిరు-విజయశాంతి

ఆ రోజల్లో సూపర్‌డూపర్ హిట్ కాంబినేషన్ వాళ్లది. వాళ్లిద్దరూ సాంగు సింగి స్టెప్పేశారంటే... సిల్వర్‌స్క్రీన్‌ చిత్తడైపోవాల్సిందే. అసలా ఇద్దరూ సినిమాలో ఉన్నారంటే చాలు... హండ్రెడ్ డేస్ గ్యారంటీ. అలాంటి హిట్‌పెయిర్ చిరంజీవి, విజయశాంతిది. ఆ తర్వాత చిన్న చిన్న మాటల విద్వేషాలతో.. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇక, పొలిటికల్ గ్రౌండ్‌లో ఎంట్రీ ఇవ్వగానే ఆ గ్యాప్ మరింత పెరిగింది. అయితే మహేష్‌ సినిమా పుణ్యమా అని వాళ్లిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు గుర్తుచేసుకుంటూనే ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

రాజకీయాల్లో చాలా అనుకుంటాం... స్నేహం ఎప్పటికీ పదిలంగానే ఉంటుందంటూ చేతులు కలిపారు. "సండే అనకురా మండే అనకురా ఎప్పటికీ నీదాన్నిరా అంటూ మాట ఇచ్చి నా మనిషిగా నా హీరోయిన్ గా ఉండకుండా పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి కనిపించిందని చెప్పుకొచ్చారు చిరు. విజయశాంతితో ఓ హీరోయిన్‌గా కంటే ఎక్కువ అనుబంధం ఉండేదని, మద్రాస్‌లో తన ఇంటి ఎదురుగానే విజయశాంతి కూడా ఉండేదమో కానీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను విజయశాంతి విమర్శించిన తీరును పదేపదే ప్రస్తావించారాయన.

చిరు మాటలకు వెంటనే "చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త" అంటూ నవ్వుతూనే అదేమీ లేదని చెప్పుకొచ్చారు విజయశాంతి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ మీరే నా హీరో, నేనే మీ హీరోయిన్ అంటూ భావోద్యేగానికి లోనయ్యారు లేడీ సూపర్ స్టార్. మొత్తమ్మీద.. స్నేహితులు, ఆప్తుల మధ్య రాగద్వేషాలు కలకాలం ఉండవని తేలిపోయింది. రాజకీయాలు మనుషుల మధ్య శత్రుత్వాలను పెంచితే, సినిమా రంగం మాత్రమే స్నేహాన్ని పంచుతుందన్న మెగాస్టార్ వ్యాఖ్యలు నిజమై.. టాలివుడ్ మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్ కలిసి మరో సందేశాన్ని సినీ ప్రపంచానికి అందించారు.