చిత్రపురి కాలనీలో అపోలో హాస్పిటల్: చిరంజీవి

చిత్రపురి కాలనీలో అపోలో హాస్పిటల్: చిరంజీవి

కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు సోమవారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కమిటీ సభ్యులను అభినందించి, చిత్రపురి కాలనీ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. చిత్ర పరిశ్రమ తరుపున తన మద్ధతు కొత్త కమిటీకి ఉంటుందనీ, కాలనీ సమస్యలు ఏవైనా ఉంటే తాను ముందుండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. ఉపాసనతో మాట్లాడి చిత్రపురిలో మంచి ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తానని, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని రావాలని చిరంజీవి చెప్పారు. సందర్భం ఉన్నప్పుడు చిత్రపురి కాలనీని సందర్శిస్తానని కూడా మెగాస్టార్ కమిటీ సభ్యులతో అన్నారు. చిరంజీవితో దాదాపు అర గంట పాటు చిత్రపురి కాలనీ సెక్రటరీ కాదంబరి కిరణ్, ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్, వినోద్ బాలా, దీప్తి వాజ్ పేయి, అనిత నిమ్మగడ్డ, లలిత, రామకృష్ణ ప్రసాద్, అళహరి మాట్లాడారు. తమకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చిత్రపురి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.