ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం: అహ్మద్ పటేల్ పేరు చెప్పలేదు

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం: అహ్మద్ పటేల్ పేరు చెప్పలేదు

ఆగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంపై దళారి క్రిస్టియన్ మిషెల్ మాట మార్చాడు. ఈడీ విచారణలో తను అహ్మద్ పటేల్ పేరే కాదు, ఎవరి పేర్లు చెప్పలేదని కోర్టుకు చెప్పాడు. ఈ మేరకు క్రిస్టియన్ మిషెల్ తరఫు న్యాయవాది పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈడీ చార్జిషీట్ ను మీడియాకు లీక్ చేసిందని పటియాలా హౌస్ కోర్టు ఎదుట దాఖలు చేసిన పిటిషన్ లో మిషెల్ న్యాయవాది ఆరోపించారు.

చార్జిషీట్ నకలు మిషెల్ కి అందజేయకుండానే మీడియాకు లీక్ చేశారని మిషెల్ న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ విచారణలో మిషెల్ ఏ వ్యక్తి పేరును చెప్పలేదని ఆయన తన అభ్యర్థన పత్రంలో వాదించారు. 'ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్' (స్వేచ్ఛగా, నిజాయితీగా విచారణ) జరగాలని కోర్టును అభ్యర్థించారు. గురువారం చార్జిషీట్ ద్వారా ఈడీ సంచలనాత్మక వివరాలను ప్రకటించింది. ఈడీ తన చార్జిషీట్ లో అహ్మద్ పటేల్, ఆయన కుటుంబం గురించి ప్రస్తావించింది. విచారణలో క్రిస్టియన్ మిషెల్ AP అనే పొడి అక్షరాలకు అర్థం అహ్మద్ పటేల్ అని, FAM అంటే ఫ్యామిలీ అని చెప్పినట్టు ఈడీ తెలిపింది.

మిషెల్ తన లేఖలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఒత్తిడి తెచ్చిన విషయం కూడా పేర్కొన్నాడు. మిషెల్ ఉత్తరం ద్వారా మాజీ ప్రధానిపై బడా నేతలు ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమైందని ఈడీ చెప్పింది. సీబీఐ తర్వాత ఈడీ మిషెల్ ను ప్రశ్నించింది. మిషెల్ తన మరో ఇద్దరు సహచరులతో కలిసి ఈ నేరపూరిత కుట్ర రచించినట్టు ఆరోపణ. ఇందులో మిషెల్ తో పాటు అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.