సీజేఐ కేస్: దర్యాప్తు రిపోర్ట్ కోరిన ఫిర్యాదీ మహిళ

సీజేఐ కేస్: దర్యాప్తు రిపోర్ట్ కోరిన ఫిర్యాదీ మహిళ

సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి క్లీన్ చిట్ లభించింది. కేసులో ఫిర్యాదీదారైన మహిళ సుప్రీంకోర్ట్ దర్యాప్తు ప్యానెల్ నుంచి సీజేఐ రంజన్ గొగోయ్ కి ఇచ్చిన క్లీన్ చిట్ పై రిపోర్ట్ కాపీని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్ట్ ముగ్గురు న్యాయమూర్తుల అంతర్గత కమిటీ సీజేఐ రంజన్ గొగోయ్ కి క్లీన్ చిట్ ఇస్తూ తమకు దీనికి సంబంధించి 'గట్టి ఆధారాలు' ఏవీ దొరకలేదని చెప్పింది. సుప్రీంకోర్ట్ సెక్రటరీ జనరల్ కార్యాలయం ఒక నోటీసులో జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన ఏర్పాటైన సంఘం రిపోర్ట్ 'బహిర్గత పరచడం జరగదని' పేర్కొంది. కమిటీలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు ఉన్నారు.

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మహిళలు సుప్రీంకోర్ట్ బయట నిరసన ప్రదర్శనలు జరిపారు. ఇందులో మహిళా న్యాయవాదులతో పాటు కొందరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీలోని లూటియన్స్ జోన్ లో పెద్ద సంఖ్యలో గుమికూడటంపై పోలీసులు నిషేధం విధించారు. నినాదాల మధ్య కొందరు ప్రదర్శనకారులు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. సుప్రీంకోర్ట్ ఒక మాజీ ఉద్యోగిని చీఫ్ జస్టిస్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించింది. 

'ఈ ప్రక్రియ పూర్తిగా అన్యాయంగా జరిగినట్టు అనిపిస్తోంది. బాధితురాలికి రిపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? ఇది తప్పు. వాళ్లు కేసును కొట్టివేస్తున్నపుడు సుప్రీంకోర్ట్ ద్వారా నిర్వహించిన ప్రక్రియపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది అన్యాయం' అని సీపీఐ(ఎం) నేత బృందా కారత్ అన్నారు. సుప్రీంకోర్ట్ పరిసరాల బయట ఆందోళనకారులు ఫిర్యాదీదారుకి రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.