డబ్బులతో కొనలేక.. ఇలా చేశారా?

డబ్బులతో కొనలేక.. ఇలా చేశారా?

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ కోర్టు మాజీ జూనియర్‌ అసిస్టెంట్‌ నిన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు ప్రచురించాయి. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా జస్టిస్‌ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను సంబంధిత అధికారి దృష్టికి తెచ్చారు. దీంతో సుప్రీం కోర్టు త్రి సభ్య బెంచ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమేగాక.. తక్షణమే సమావేశమైంది. బెంచ్‌లో ఉన్న జస్టిస్‌ గొగోయ్‌ తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పరిస్థితులు హద్దులు దాటడంతో తాను ఇవాళ కోర్టు బెంచ్‌లో కూర్చోవాలనే అసాధరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జస్టిస్‌ గొగోయ్ అన్నారు. 'నమ్మశక్యంగా లేదు. ఈ ఆరోపణలను ఖండిచేందుకు నేను మరీ దిగజారి మాట్లాడదల్చుకోలేదు. డబ్బు ఎరతో ఎవరూ నా దరిదాపుల్లోకి రాలేకపోయారు. అందుకే వేరే మార్గాలు వెతికారు. చివరికి ఇలా చేశార'ని గొగోయ్‌ అన్నారు. మొత్తం న్యాయవ్యవస్థే ప్రమాదంలో పడింది. ఇలాగైతే మంచివాళ్ళెవరూ ఈ రంగంలోకి రారని జస్టిస్ గొగోయ్‌ అన్నారు.  మీడియా సంస్థలు ఇలాంటి వార్తల విషయంలో కాస్త సంయమనం పాటించాలని బెంచ్‌ పేర్కొంది. క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఓ మహిళకు సుప్రీం కోర్టులో ఉద్యోగానికి ఢిల్లీ పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ అన్నారు.