సీజేఐపై మహిళ చేసిన లైంగిక ఆరోపణలు ఇవే..!

సీజేఐపై మహిళ చేసిన లైంగిక ఆరోపణలు ఇవే..!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మూడు ప్రముఖ వెబ్‌సైట్లలో ఈ వార్తలు రాగా... వెంటనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ కూడా జరిపింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. అయితే, సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22 మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఏం ఆరోపణలు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. 

జస్టిస రంజన్‌ గొగోయ్‌ గతంలో తనను  లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22 మంది న్యాయమూర్తులకు అఫిడవిట్‌ సమర్పించింది. 2018 అక్టోబర్‌ 10, 11 తేదీల్లో జస్టిస్‌ గొగోయ్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. రంజన్ గొగోయ్ వెనుక నుంచి నా నడుము చుట్టు చేయివేసి గట్టిగా పట్టుకున్నారు. చేతులతో నా శరీరమంతా తడిమారు. అనంతరం గట్టిగా హత్తుకున్నారు. నన్ను కూడా కౌగిలించుకోమన్నారు. అయితే వెంటనే ఆయన నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతో సుప్రీంకోర్టు జడ్జిలను ఆశ్రయించానన్నారు. 

ఆగస్టు 2018లో ఆయన ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ వేధింపులను ప్రతిఘటించిన నేపథ్యంలో నెలల తరువాత, అనుమతి లేకుండా ఒక రోజు సాధారణం సెలవుతీసుకున్న కారణంగా డిసెంబర్ 21న సర్వీసులనుంచి తొలగించారు. అంతేకాదు, నా కుటుంబం కూడా వేధింపులకు గురైంది. ఢిల్లీలో హెడ్‌ కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న నా భర్త, సోదరుడు డిసెంబరు 28, 2018 (పరస్పరం అంగీకారంతో రద్దు చేసుకున్న 2012 నాటి కేసు ఆధారంగా) సస్పెన్షన్‌కు గురయ్యారు. జనవరి 11న, ఒక  మహిళా పోలీసు అధికారి సమక్షంలో నాతో.. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ భార్యకు క్షమాపణలు చెప్పించారు. అలా ఎందుకు చేశారో అర్థంకానప్పటికీ, పై అధికారి సూచలను పాటించాను. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా  వేధింపులు ఆగలేదు. 

ఆ తర్వాత, జూనియర్ కోర్టు అటెండెంట్‌గా తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న దివ్యాంగుడైన మరో బంధువును సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని మా స్వగ్రామానికి వెళ్లిన నన్ను, నా భర్తను చీటింగ్‌ కేసులో విచారించాలంటూ మార్చి 9న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిందనేది ఆరోపణ. ఆ మరుసటి రోజు తనతోపాటు, భర్త, బావ, ఆయన భార్య, ఇతర బంధువులను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 24 గంటల పాటు కాళ్లు చేతులకు సంకెళ్లువేసి, తిండి, నీళ్లు ఇవ్వకుండా శారీరంగా హింసించడంతోపాటు దుర్భాషలాడారని.. ఈ ఆరోపణలకు తోడు వీటికి సంబంధించి కొంత వీడియో ఫుటేజ్‌ను, ఫోటోలను ఆమె అఫిడవిట్‌లో పొందుపర్చారు. అయితే, సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ ఆరోపణలను  తిరస్కరించారు. ఇవి పూర్తిగా తప్పుడు,  దురదృష్టకరమైన ఆరోపపణలని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు మహిళకు నేర చరిత ఉందని ఆమెపై ఇప్పటికే  రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయని సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదనలలో సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.