భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఆర్బీఐ ఇవాళ ప్రకటించిన పరపతి విధానం స్టాక్‌ మార్కెట్‌ను తీవ్రంగా నిరాశపర్చింది. మార్కెట్‌ ఇది వరకే పావు శాతం రెపో రేటును డిస్కౌంట్‌ చేసినందున... ఇవాళ అర శాతం వడ్డీ రేటును తగ్గించడం లేదా ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్యకు ఓ పరిష్కారం చూపడం వంటి అంశాల కోసం మార్కెట్‌  ఎదురు చూసుంది. అవేవీ లేకపోవడంతో మార్కెట్‌ భారీగా క్షీణించింది. ఉదయం 12,039 వద్ద స్వల్ప లాభంతో ప్రారంభమైనా.. స్వల్ప లాభంతో ట్రేడవుతూ వచ్చింది. పరపతి విధానం నిరాశాజనకంగా ఉండటంతో ఓపెనింగ్‌ స్థాయే గరిష్ఠ స్థాయిగా మారింది. పరపతి విధానం తరవాత క్రమంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా నిఫ్టి బ్యాంకింగ్‌  ఇండెక్స్‌  భారీగా క్షీణించింది. దీని ప్రభావం నిఫ్టిపై బాగా చూపింది. ఒకదశలో 11,830కి క్షీణించిన నిఫ్టి చివర్లో కాస్త తేరుకుని 178 పాయింట్ల నష్టంతో 11,843 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 553 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో కోల్‌ ఇండియా, టైటాన్‌, హీరోమోటోకార్ప్‌, ఎన్‌టీపీసీ, పవర్‌ గిడ్‌లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టిలో టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో గెయిల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, వాక్రంగి, లక్స్‌ ఇండస్ట్రీస్‌, హెరిటేజ్‌ ఫుడ్స్‌, హెచ్‌ఎస్‌సీఎల్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన షేర్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లలో దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, గెయిల్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, పీసీ జ్యువల్లర్స్ ఉన్నాయి.