నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఆర్బీఐ పరపతి విధానంలో మెరుపు ఏవీ లేకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ నిస్తేజంగా నష్టాలతో ముగిసింది. ఉదయం స్వల్ప లాభంతో ప్రారంభమైన నిఫ్టికి అదే గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి క్రమంగా పడుతూ వచ్చిన నిఫ్టికి మధ్యలో ఆర్బీఐ పరపతి విధానం ఎలాంటి బూస్ట్‌ ఇవ్వలేకపోయింది. అప్పటికే క్షీణించిన నిఫ్టి... పరపతి విధానం ప్రకటించే సమయానికి లాభాల్లోకి వచ్చింది. కాని మార్కెట్‌ ఆశించినట్లు  0.25 శాతం రెపో రేటు తగ్గింపు తప్ప.. మరే మెరుపులు లేవు.  పైగా ప్రథమార్ధంలో జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతం దిగువకు వెళుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో నిఫ్టి పతనం ప్రారంభమైంది. 3 గంటలకల్లా 11,559కి క్షీణించిన నిఫ్టి తరవాత స్వల్పంగా కోలుకుని  11598 వద్ద ముగిసింది. నిఫ్టి 46 పాయింట్లు క్షీణించగా, సెన్సెక్స్‌ 192 తగ్గింది.  నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, బ్రిటానియా షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో టీసీఎస్‌, బీపీసీఎల్‌, హిందాల్కో, ఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఇతర షేర్లలో ఆర్‌ కామ్‌, ఐడియా షేర్లు నాలుగు శాతంపైగా నష్టపోయాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్రధాన షేర్లలో ఓరియంట్‌ టెక్‌, స్వాన్‌ ఎనర్జి, ఫోర్స్‌ మోటార్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, దిష్మన్‌ కార్పొ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టపోయిన షేర్లలో రెప్కో హోమ్స్‌, టాటా స్టీల్‌ (పీపీ) ఎన్‌సీసీ, ఐడియా, ఆర్ కామ్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.