స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య నిఫ్టి స్థిరంగా ముగిసింది. వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్‌ కావడంతో  మిడ్‌ సెషన్‌ వరకు నిఫ్టి ఒకే దశలో పయనించింది. అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్‌  తీసుకుని ఒకే దిశలో సాగింది. నిఫ్టి ఇవాళ ఉదయం 33 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అక్కడి నుంచి క్రమం క్షీణిస్తూ మధ్యాహ్నం 12 గంటల కల్లా 11,817 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరింది. యూరో మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడతో... మిడ్‌ సెషన్‌ నుంచి క్రమంగా కోలుకుంది. క్లోజింగ్‌ సమయానికల్లా నిఫ్టి 11,931 పాయింట్లకు చేరి...   తరువాత 11,914 వద్ద ముగిసింది. అంటే ఇవాళ్టి నష్టాలను పూర్తిగా తుడుచిపెట్టేసి అదనంగా 8 పాయింట్లు లాభపడిందన్నమాట. ముడి చమురు ధరలు ఇవాళ ఉదయం అనూహ్యంగా 3 శాతం పైగా పెరిగాయి. దాదాపు రూ. 98,000 కోట్లను విదేశాలకు దారి మళ్ళించారంటూ ఓ పాల వ్యాపారి ఇండియా బుల్స్‌ గ్రూప్‌పై వేసిన పిటీషన్‌ను ఇవాళ ఉపసంహరించుకున్నాడు. దీంతో ఇండియా బుల్స్‌ గ్రూప్‌ షేర్లతో పాటు ఈ గ్రూప్‌ టేకోవర్‌ చేయదలచిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేర్లు కూడా భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (12 శాతం లాభం), జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బీపీసీఎల్‌, గ్రాసిం, కొటక్‌ బ్యాంక్ షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక టాప్ లూజర్స్‌గా నిలిచిన షేర్ల జాబితాలో ఎస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఐఓసీ, మారుతీ ఉన్నాయి. ఇక బీఎస్ఈ సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా ... ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (12 శాతం), లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (10 శాతం) అదానీ ట్రాన్స్‌మిషన్‌, సింజైన్‌, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేర్లు ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో... జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎస్‌ బ్యాంక్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆర్‌ పవర్‌, జీఎస్‌పీఎల్ షేర్లు ఉన్నాయి‌.