పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది

కాంగ్రెస్ నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్లే పార్టీ మారామన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇదే నాయకుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని, మరి ఆయనను ఎందుకు బీఫారమ్ అడిగారని భట్టి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ తాను చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ లాంటి పొలిటికల్ టెర్రరిస్టులు అందరూ ఓ మాఫియాలా తయారయ్యారని ఆరోపించారు. ఈ పొలిటికల్ మాఫియా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఇలాంటి వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

'తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.  ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరి మద్దతు కావాలి. తాను చేపట్టిన ఈ పోరాటం ఆరంభం మాత్రమే.. తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్‌ పుట్టలో దాక్కొని ఫిరాయింపులపై మాట్లాడుతున్నారు. ఆయనను పుట్టలోంచి ఎలా బయటకు రప్పించాలో తమకు తెలుసు. ప్రగతిభవన్‌లో ఎమ్మెల్యేలతో భేరసారాలు నడిపింది వాస్తవం కాదా? .  రాజకీయ మాఫియాను ఆపకపోతే ప్రజల ఓటుకు విలువ పోతుంది. భవిష్యత్తులో డబ్బు ఉన్నవాళ్లంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి సీఎంలు అవుతారు. వివిధ వర్గాల మేధావులతో ఫిరాయింపులపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నాం' అని భట్టి విక్రమార్క తెలిపారు.