కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ 

కేసీఆర్ ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ 

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఓ పొలిటికల్ టెర్రరిస్ట్ లా వ్యవహరిస్తున్నారని సీఎల్పీనేత, ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్‌లో శాసనసభాపక్షంలో సీఎల్పీని విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద భట్టి విక్రమార్క శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వీహెచ్‌, ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సంద‌ర్భంగా ప్రజ‌ల‌ను, కాంగ్రెస్ కార్యక‌ర్తల‌ను ఉద్దేశించి భట్టి ప్రసంగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర రావు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగాన్ని అవ‌హేళ‌న చేస్తూ రాష్ట్రంలో ప‌రిపాల‌న చేస్తున్నార‌ని మండిపడ్డారు. ప్రతిప‌క్ష నాయ‌కుడికి, పీసీసీ అధ్యక్షుడుకి అందుబాటులోకి రాని స్పీక‌ర్‌.. ఫిరాయించిన శాస‌న‌స‌భ్యుల‌కు మాత్రం  ర‌హ‌స్య ప్రాంతంలో అందుబాటులోకి వ‌చ్చార‌ని భ‌ట్టి ధ్వజ‌మెత్తారు. ఎవ‌రి మీద అయితే డిస్ క్వాలిఫికేష‌న్ పిటీష‌న్ ఇచ్చామో.. వారి నుంచి పిటీష‌న్ తీసుకోవ‌డం ప్రజాస్వామ్యంలో ఎటువంటి సంకేతాల‌ను పంపుతుంద‌ని భ‌ట్టి ప్రశ్నించారు. చ‌ట్ట ప్రకారం న‌డుచుకుందాం, స‌భా నియ‌మాల ప్రకారం ముందుకు పోదాం అన్న ప్రతిప‌క్ష నాయ‌కుడికి స్పీక‌ర్ అందుబాటులోకి రాక‌పోవ‌డం సిగ్గుచేటన్నారు. అందుబాటులోకి రాక‌పోగా.. తన కార్యద‌ర్శి చేత అరెస్ట్ చేయించి.. పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌మ‌ని ఆదేశించ‌డం ఎటువంటిప్రజాస్వామ్యమ‌ని ఆయ‌న అన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మేన‌ని భట్టి అన్నారు.