టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం సంపూర్ణం

టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తయ్యింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తయినట్లు శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వినతి పత్రం సమర్పించారు. తామంతా  కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యామని.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో చేరాలని నిర్ణయించుకున్నందున తమను ఆ పార్టీలో విలీనం చేయాలని స్పీకర్‌కు తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కూడా ఆ 12 మందిని విలీనం చేసుకొనేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం ఆ 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలనూ టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. తమ సభ్యుల సంఖ్య 6కి పడిపోడంతో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. తెలంగాణ అసెంబ్లీలో ఏడుగురు సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం నిలిచింది.