మిగిలేది ఆ ఐదుగురేనా..?

మిగిలేది ఆ ఐదుగురేనా..?

పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది... ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కారెక్కడానికి సిద్ధం కాగా... తాజాగా మరో ఇద్దరు కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరుతోంది. ఇక, నల్గొండ ఎంపీగా విజయం సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంత.. ఇక కాంగ్రెస్‌లో మిగిలేది ఆ ఐదుగురేనా? అనే చర్చ మొదలైంది. దీంతో మరోసారి సీఎల్పీ విలీనాన్ని అధికార టీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. 

ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరేందుకు మహేశ్వరం నుంచి సబితాఇంద్రారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి జాజుల సురేందర్, పినపాక నుంచి రేగ కాంతారావు, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి హరిప్రియ, కొత్తగూడెం నుంచి వనమా వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, ఎల్బీనగర్‌ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు, కొల్లాపూర్‌ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి చేరిపోగా.. ఇప్పుడు తాండూరు నుంచి రోహిత్ రెడ్డి, భద్రాచలం నుంచి వీరయ్య చేరికతో ఆ సంఖ్య 13కు చేరుతుంది. అయితే కాంగ్రెస్ బలంలో మూడింట రెండొంతులవుతుంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే ఆమోదం తెలియజేయడం వెనువెంటనే జరిగిపోయింది. దీంతో కాంగ్రెస్‌ శాసనసభ్యుల సంఖ్య 18కి పడిపోయింది. ఇక 18 మంది ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతులంటే 12 మంది సంఖ్యాబలం ఉంటే చాలు. ఇప్పటికే 11 మంది శాసన సభ్యులు తెరాస వైపు ఉండడంతో కావల్సింది ఇక ఒకే ఒక్కరు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రెడీ ఉండడంతో సీఎల్పీని టీఆర్ఎస్‌లో చేసే ప్రక్రియకు మార్గం సుగమం అయిపోయినట్టే. ఇప్పుడు స్పీకర్‌కు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు లేఖ రాస్తే ఆ ప్రక్రియ వెంటనే జరిగిపోయే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీలో మిగిలేది సీఎల్పీ నేత మల్లు భట్టి విక్కమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క మాత్రమే మిగులుతారా? అనే చర్చ సాగుతోంది. వీరిలో కూడా ఇక టీఆర్ఎస్‌తో ఎవరైనా టచ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు లేకపోలేదు.