ఆ రిజర్వేషన్ల సంగతేంటీ : చంద్రబాబు

ఆ రిజర్వేషన్ల సంగతేంటీ  : చంద్రబాబు

ఎన్నికలు సమీపిస్తున్నందువల్లే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని సిఎం చంద్రబాబు  విమర్శించారు. కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని, వెంటనే వారికీ  రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు  కోరారు.  వాల్మీకులకు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని సిఎం భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారాయన. కర్నూలు ప్రజల అండ ఉంటే..ఎంతటి కొండనైనా ఎదిరిస్తానని చెప్పారు.రూ.230 కోట్ల వ్యయంతో 26,400 ఎకరాలకు సాగు నీరు అందించడానికి పులికనుమ రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తుది శ్వాస వరకు బడుగు బలహీన ప్రజల అభ్యున్నతి కొరకే పనిచేస్తానని సిఎం ఉద్వేగంగా అన్నారు.