నేడు టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన..!

నేడు టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన..!

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలచే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింపిన చంద్రబాబు... ఇవాళ 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. శుక్రవారమే లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించాలని భావించినా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇవాళ తిరుపతిలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప ఖరారు కాగా.. తిరుపతి నుంచి పనబాక లక్ష్మితోపాటు మాజీ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పేరు కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. చివరకి పనబాకకే టికెట్‌ ఖరారైనట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేయటానికి సిట్టింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ విముఖత ప్రదర్శించటంతో ఆయన కోడలు రూప పేరు తెర పైకి వచ్చింది. నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులతో పాటు శివానందరెడ్డి పోటీపడుతున్నారు. శివానందరెడ్డికే  కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకురాలు ముళ్లపూడి రేణుకల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమలాపురానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథుర్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌ల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన టీడీపీ అధినేత ఇవాళ 15 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు.