కేసీఆర్ 'ముందస్తు' వరాలు

కేసీఆర్ 'ముందస్తు' వరాలు

ముందస్తు ఎన్నికలు సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్ అందిచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. టీవీల వినియోగంతో పాటు ఇతర విద్యుత్ గృహోపకరాలు పెరినందున 101 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ అందివ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అయ్యే విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే డిస్కమ్ లకు చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5వేల భృతి ఇవ్వాలని కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన భృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మౌజమ్, ఇమామ్ లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భృతి అందించారు. ఆ తర్వాత దాన్ని రూ.1500 కు పెంచారు. 2018 సెప్టెంబర్ 1 నుంచి ఆ భృతిని రూ.5వేలకు పెంచుతున్నట్లు సిఎం ప్రకటించారు. రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే దాదాపు 9వేల మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని సీఎం అన్నారు.

రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇకపై ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి  ఈ వేతనాలు అందుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరించినప్పుడు, పూజారుల వేతనాలను కూడా విధిగా సవరిస్తామని చెప్పారు. పూజారుల పదవీ విరమణ వయో పరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. జీతాల చెల్లింపు, పదవీ విరమణ వయో పరిమితి పెంపుకు సంబంధించి విధివిధానాలు తయారు చేసి, సోమవారం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హెచ్ఎం/వార్డెన్ కు రూ.5వేల నుంచి రూ.21 వేలకు, సిఆర్టీలకు రూ.4వేల నుంచి రూ.15వేలకు, పిఇటిలకు రూ.4వేల నుంచి రూ.11వేలకు, అకౌంటెంట్ కు రూ.3,500 నుంచి రూ.10,000, ఎఎన్ఎంలకు రూ.4వేల నుంచి రూ.9వేలకు, కుక్స్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, ఆయాలకు రూ.2,500 నుంచి రూ.7,500కు, హెల్పర్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్ మెన్ కు రూ.2,500 నుంచి రూ.7,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు.

తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా దేవర మల్లప్పను నియమించాలని సీఎం నిర్ణయించారు. అలాగే తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా బాద్మి శివకుమార్‌ను నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు.