త్వరలో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ

త్వరలో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ

త్వరలో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని తెలిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై.. మంత్రి వర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ రాత్రి ప్రగతి భవన్‌లో చర్చించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగుల బదలీలకు తెలంగాణ ప్రభుత్వం  అంగీకరించింది.. ఇందుకు సంబంధించి అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ వేశాం అన్నారు. శాశ్వత బదిలీల విధానం కూడా తయారు చేయాలని.. అలాగే భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. జోనల్ విధానంపై మంత్రి వర్గ ఉపసంఘం వేశాం.. అయితే సబ్ కమిటీ నివేదిక అనంతరం కేబినేట్ ఆమోదిస్తుంది అని తెలిపారు. రాష్ట్రపతికి పంపించి నెల రోజుల్లోనే ఉత్తర్వులు వచ్చేలా చూస్తాం అని హామీ ఇచ్చారు.

ప్రతి ఉద్యోగికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవ్వాలని.. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేలా చూస్తామన్నారు. ఇక భాషా పండితులు, పీఈటీల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం అని తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సాఫీగా జరిగేలా ఓ విధానం రూపొందించాలని ఆదేశించాం. పదోన్నతుల విధానంపై పాలసీ.. మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 5 రోజులు ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు అంగీకరించాం అని తెలిపారు. ఆర్టీసీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. పోలీసుల సమస్యలను కూడా ఉన్నాయని తెలిసింది.. త్వరలో అవి కూడా పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇస్తాం.. త్వరలో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని తెలిపారు. జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తాం అని హామీ ఇచ్చారు. ఆగస్టు 15 కంటే ముందు నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు.