సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

అధికారులకు హెచ్చరికలు, సర్పంచులకు లక్ష్యాలు నిర్ధేశిస్తూ.. కీలక నిర్ణయాలు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. 85 శాతంమొక్కలు బతికి తీరాల్సిందేనని, లక్ష్యాలు చేరుకోని సర్పంచ్‌లపై వేటు తప్పదని హెచ్చరించారు. మిషన్‌ భగీరథతో పంచాయతీలపై మంచినీటి భారం తీరిందన్న సీఎం... 30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని.,  లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో పల్లెల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు సిద్ధమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. క్షేత్రస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అన్ని గ్రామాల్లోనూ ప్రారంభం కానుండటంతో దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. 

రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించడంతో పాటు వారికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. పచ్చదనం పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నాలుగు పేజీల పత్రాన్ని కూడా అధికారులకు అందజేశారు. సరిగా పనిచేయని కలెక్టర్లకు వార్షిక ప్రణాళికలో ప్రతికూల మార్కులు ఉంటాయన్నారు కేసీఆర్. కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని., ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇచ్చి సంరక్షించేలా చూడాలిని సూచించారు.  కావాల్సిన మొక్కల వివరాలు సేకరించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేన్నారు.  ప్రతి ఇంటికీ కృష్ణ తులసిమొక్క తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. పంచాయతీలకు నిధుల కొరత ఉండదని., ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. వందశాతం పన్నులు వసూలు చేయాలని., ఆ బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని స్పష్టంచేశారు. ఉద్యోగులను అధికారులను పరుష పదజాలంతో దూషించేవారిపై చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు సీఎం కేసీఆర్.