గ్రేటర్ మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు కేసీఆర్ కీలక సూచనలు

గ్రేటర్ మేయర్‌, డిప్యూటీ మేయర్‌కు కేసీఆర్ కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్‌ మేయర్, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లకు కీలక సూచనలు చేశారు తెలంగాణ సీఎం కేసీర్.. కొత్తగా ఎన్నికైన గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం మాట్లాడుతూ కర్తవ్యబోధ చేశారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతల ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోంది.. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని పిలుపునిచ్చారు. 

ప్రజలకు సేవ చేసే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది.. కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు.. ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అన్నారు సీఎం కేసీఆర్... మంచిగ ఉంటెనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దు. వేష, భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది.. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి.. సరైన గౌరవం ఇచ్చి.. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి... చేతనయినంత సాయం చేయాలి.. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి అంటూ కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్.