రహదారులన్నీ అద్దంలా మారాలి: కేసీఆర్

రహదారులన్నీ అద్దంలా మారాలి: కేసీఆర్

 తెలంగాణ రాష్ట్రంలోని రహదారులన్నీ అద్దంలా మారాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సునీల్ శర్మ, రామకృష్ణరావు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ చంద్రశేఖర్, సీఎంవో అధికారులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ప్రభుత్వం రహదారులకే ప్రాధాన్యం ఇస్తుంది. రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రహదారులను అద్దంలా మార్చుతామన్నారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలతో సహా, రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు బీటీ రహదారి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది?, వాటిని అద్దంలా తయారు చేయడానికి ఏం చేయాలి? అనే విషయంపై ప్రణాళిక రూపొందించాలి. దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం ద్వారా రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు సాధించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో అవసరమైన చోట రహదారులకు మరమత్తులు చేయాలని, శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలకు మరమత్తులు చేయాలని, ఇరుకు బ్రిడ్జిలను వెడల్పు చేయాలని.. దీనికోసం ఇఎన్సీ స్థాయి నుంచి ఎఇ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి ఆర్ అండ్ బి అధికారుల సదస్సు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతీ రోడ్డు పరిస్థితిని సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని సీఎం కోరారు. ఏ జిల్లా, ఏ మండలం అనే తేడా లేకుండా.. అక్కడ ఏ పార్టీ ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం పక్కన బెట్టి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్ల మరమత్తులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా రోడ్ల మరమత్తు పనులను చేయించుకోవాలని సూచించారు.

పంచాయతీ రాజ్ నుంచి ఆర్ అండ్ బికి, ఆర్ అండ్ బి నుంచి జాతీయ రహదారులకు రోడ్లు బదిలీ అయిన సందర్భంలో, వాటి నిర్వహణ, మరమ్మతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు నిర్మాణం అయ్యేవరకు పాత రోడ్లు పాడుపడినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీని వల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. రోడ్లను బదిలీ చేసే సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం చేపట్టామని, వాటి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.  కొత్తగా నిర్మించిన క్వార్టర్లను ఎమ్మెల్యేలకు కేటాయించనున్నట్లు సీఎం తెలిపారు.