కార్మికులకి కేసీఆర్ బంపర్ ఆఫర్

కార్మికులకి కేసీఆర్ బంపర్ ఆఫర్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంతో జోష్ మీదున్న కేసీఆర్ ఆర్టీసీ మీద కూడా పలు కీలక ప్రకటనలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని స్పష్టం చేసిన ఆయన ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే సమాధానం అనేలా వ్యాఖ్యానించారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని ఆర్టీసీ పూర్తిగా మునిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక అదే సమయంలో కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. కార్మికులు తెలివైనోళ్లయితే దరఖాస్తులు పెట్టుకుని తిరిగి డ్యూటీలో చేరాలన్నారు. దరఖాస్తు తీసుకుని డ్యూటీకి వెళ్తే ఎవరూ వెళ్లగొట్టరని చెప్పారు. స్వచ్చందంగా వెళ్లిపోయారు కనుక వాళ్లే స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరాలని అన్నారు. యూనియన్లు పక్కనపెట్టి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకునే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, ఎస్మా ఉండగా సమ్మెకు వెళ్ళడం సరి కాదని సీఎం చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల రాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉండదని సీఎం వివరించారు.