జగన్ తో కలిసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నా...

జగన్ తో కలిసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నా...

 

ఈరోజు తెలంగాణా సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురం వెళ్లారు. కాంచీపురంలో నలభై ఏళ్ళకి ఒక్కసారి మాత్రమే దర్శనం ఇచ్చే అత్తి వరదరాజస్వామి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయన తిరుగి హైదరాబాద్ ప్రయాణం అయ్యి మార్గమధ్యంలో ఉన్న చిత్తూరు జిల్లా నగరిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు ఆయన రోజా నివాసంలోనే గడిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేని సరికొత్త అధ్యాయాన్ని తాను, జగన్ కలిసి లిఖించబోతున్నామని చెప్పారు.

గోదావరి జలాలను వృథాగా పోనివ్వకుండా శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రజలకు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. ఏటా కృష్ణా, గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీటి వృథాను అరికట్టి ఏపీ ప్రజలకు అందేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు.  జగన్ ను పట్టుదల ఉన్న నేత అని, రాయలసీమ అభివృద్ధి విషయంలో తాను జగన్ కు పెద్దన్నలా వ్యవహరిస్తానని అన్నారు. ఆ విషయమే కాక అన్ని విషయాల్లో సాయంగా ఉంటానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను, జగన్ కలిసి పనిచేస్తామని చెప్పారు. హైదరాబాద్ బయలుదేరుతూ  రోజా మంచి ఆథిత్యం ఇచ్చారని చెబుతూ అన్నదాతా సుఖీభవ అంటూ రోజాను దీవించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు.