నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

 నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జులై నుంచే కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభించనున్నారు. దీంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్వహణకు సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావాలని సీఎం సూచించారు. కాల్వల నిర్వహణకు సమగ్ర వ్యూహం రూపొందించాలని ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలో నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగానే కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

'తెలంగాణ ఇప్పటి వరకు కరువు ప్రాంతం. సాగునీటికి అష్టకష్టాలు పడిన నేల. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలతో పాటు, ఇతర కాల్వలలో మూడు నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే నామమాత్రంగా నీళ్లు వచ్చేవి. దీంతో నీటి ప్రవాహాన్ని పంట పొలాల వరకు తరలించేందుకు అనుగుణంగా కాల్వల నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. తెలంగాణలో వర్షం పడకపోయి, ప్రాణహిత ద్వారా గోదావరిలోకి పుష్కలంగా నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది జూలై నుంచే నీటిని ఎత్తిపోయడం ప్రారంభం అవుతుంది. మేడిగడ్డ నుంచి సుందిళ్ల, అన్నారం ద్వారా మిడ్ మానేరు, ఎల్లంపల్లికి అక్కడి నుంచి అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు, ఇటు మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీరు పంపింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అప్రమత్తం కావాలి. మిడ్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, శ్రీరాం సాగర్ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు నింపుతాం' అని కేసీఆర్ తెలిపారు.