కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం సమీక్ష

కాళేశ్వరం పనుల పురోగతిపై సీఎం సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు, సబ్‌స్టేషన్ల వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీసు క్యాంపు ఏర్పాటు చేసి, బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని ఆదేశించారు. 

బ్యారేజీల వద్ద నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ప్లడ్ లెవల్‌కు చాలా ఎత్తులో వాచ్‌టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలి. ప్రస్తుతమున్న హెచ్‌ఎఫ్‌ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల ద్వారా చెరువులను నింపడానికి చేసిన ఏర్పాట్లను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, సీఎస్ ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.