కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్తు సరఫరాపై ఉన్నతాధికారులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏటా 540 టీఎంసీల నుంచి 600 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరివ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే విద్యుత్తుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి రెండు టీఎంసీలు, వచ్చే ఏడాది నుంచి మూడు టీఎంసీలను గోదావరి నుంచి ఎత్తిపోయడానికి నిర్ణయించామన్నారు. రెండు టీఎంసీలకు 3,800 మెగావాట్లు, మూడు టీఎంసీలకు 6,100 మెగావాట్ల విద్యుత్తు అవసరమని చెప్పారు. కావాల్సినంత విద్యుత్తును సమకూర్చుకుని గోదావరిలో ప్రవాహం ఉండే ఆరు నెలలపాటు నిర్విరామంగా సరఫరా చేయాలని విద్యుత్తు సంస్థను కోరారు. వచ్చే నెల పదో తేదీలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తిచేయాలని జులై నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్తు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు, ఎంపీ జె.సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.