ఎన్నికల విషయం నాకు వదిలేయండి: కేసీఆర్

ఎన్నికల విషయం నాకు వదిలేయండి: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విషయం నాకు వదిలేయండి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడనేది నాకు వదిలేయండి. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరగొచ్చు.. పార్టీ నేతలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న అన్ని స్థానాలూ మనమే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరకు లేదా అక్టోబర్‌ మొదటి వారంలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం పది స్థానాల్లో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో తెరాస ఉందన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లోనే అభ్యర్థుల పరిస్థితి బాగాలేదు.. వారికి వేరే పదవులు ఇస్తాం. వారికి టిక్కెట్లు లేవు అని సీఎం తెలిపారు. అయితే అభ్యర్థుల మార్పు సిట్టింగులతో మాట్లాడే చేస్తామని చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ 50 రోజులు..100 నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారట. 

సెప్టెంబరు 2న జరిగే ప్రగతి నివేదన సభలో భేరీ మోగిద్దామని కేసీఆర్ అన్నారు. సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సభకు అన్ని వైపుల నుండి 25 లక్షల మంది హాజరవుతారని సీఎం పేర్కొన్నారు. ప్రజలు రావటానికి అవసరమైన వాహనాలు కల్పించాలి.. వారికి ఎలాంటి ఇబ్బంది రావొద్దని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణలో గత కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికల చర్చ వాడిగా నడుస్తోంది. ఈ రోజు సీఎం కేసీఆర్ ఇచ్చిన స్పష్టతతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రెడీ అయ్యారని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత ఊపందుకోనుంది. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.