హుజూర్‌నగర్‌ బైపోల్.. ప్రచారానికి గులాబీ బాస్..

హుజూర్‌నగర్‌ బైపోల్.. ప్రచారానికి గులాబీ బాస్..

పాలక, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికలకు ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది.. అధినేత కేసీఆర్ ఇవాళ ఎన్నికల ప్రచార సభలో పాల్గోబోతున్నారు. హుజూర్‌నగర్‌ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధే ఎజెండా కేసీఆర్ ప్రసంగించే అవకాశముంది. ఇప్పటి వరకు హుజూర్ నగర్‌లో సీనియర్ నేతలు, మంత్రులు మాత్రమే ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో స్వయంగా రంగంలోకి దిగారు సీఎం కేసీఆర్. హుజూర్‌నగర్ లో గులాబీ జెండా పాతడమే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారాని రెడీ అయ్యారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ సభను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. 

కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే టీఆర్ఎస్ హుజూర్‌నగర్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేటీఆర్ సహా కీలక నేతల రోడ్ షోలతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో గెలుపు మాదే నని... మెజార్టీ పెంచుకోవడంపైనే దృష్టి పెట్టామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక, గులాబీ బాస్ ప్రచారంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటు.. ఓటర్లను ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.