సచివాలయం, అసెంబ్లీకి నేడే శంకుస్థాపన..

సచివాలయం, అసెంబ్లీకి నేడే శంకుస్థాపన..

తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపనకు అంతా రెడీ అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కీలకమైన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక, ఉదయం 10 గంటలకు ప్రస్తుత సచివాలయం డి-బ్లాక్‌ వెనుకభాగంలోని తోటలో సెక్రటేరియట్ కొత్త భవనానికి శంకుస్థాపన చేయనుండగా... ఉదయం 11 గంటలకు ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఆవరణలో అసెంబ్లీ భవన నిర్మాణానికి పూమి పూజచేయనున్నారు సీఎం కేసీఆర్. 30 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయం, 17.9 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాలను నిర్మించనున్నారు. ఇక, సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అంచనా వేయగా... శాసనసభ, శాసన మండలి, సెంట్రల్‌ హాల్‌లను రూ.100 కోట్లతో నిర్మించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలను ఆహ్వానించారు అధికారులు.