సీఐడీకి సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసు !

సీఐడీకి సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల కేసు !

సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కుల వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో జారీచేసిన చెక్కులకు సంబంధించిన సెక్యూరిటీ నెంబరుతోనే ఈ చెక్కులను తయారు చేసినట్లు తేలింది. లబ్దిదారులకు జారీచేసిన చెక్కులనే ఫ్యాబ్రికేట్ చేసి నకిలీ చెక్కులు సృష్టించినట్లు గుర్తించారు. ఈ కేసును త్వరలోనే సీఐడీకి అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కేసులో తుళ్లూరు పోలీసుల విచారణ ప్రారంభమైంది.

గతంలో జారీచేసిన చెక్కులకే నకిలీవి రూపొందించి ఢిల్లీ, బెంగుళూరు, కొల్‌కతా బ్రాంచీల నుంచి డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై సెక్రటేరీయేట్‌లో తుళ్లూరు పోలీసులు విచారణ చేశారు. రెవెన్యూ శాఖలోని CMRF విభాగం అధికారులతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి అధికారులను కూడా ప్రశ్నించారు. నకిలీ చెక్కులపై కూడా అదే భద్రతా నెంబరుతోనూ, అదే సంతకం ఉండేలా ఫోర్జరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా మైలవరం, కడప జిల్లా పొద్దుటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన బాధితుల పేరిట జారీ అయిన మూడు చెక్కులను ఫోర్జరీ చేసినట్టు తేల్చారు.

బాధితుల పేరుతో జారీ అయిన చెక్కుల్లో 16 వేల రూపాయల చొప్పున రెండు, 45 వేల రూపాయలవి ఉన్నాయి. ఆ నెంబర్లతోనే నకిలీ చెక్కులను రూపొందించి కోట్ల రూపాయల మొత్తం డ్రా చేసేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఢిల్లీ, బెంగుళూరు, కొల్‌కతాలోని వేర్వేరు కంపెనీల ఖాతాల ద్వారా ఈ చెక్కులను విత్ డ్రా చేసేందుకు... ప్రయత్నించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ చెక్కుల ప్రతుల్ని స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతాలోని మోగ్రాహత్ ఎస్బీఐ బ్రాంచిలో  24కోట్ల 65 లక్షలు, ఢిల్లీలోని ఎస్బీఐ బ్రాంచీలో  39కోట్ల 85 లక్షలు, బెంగుళూరులోని మూడ్ బాద్రీ శాఖ నుంచి  52కోట్ల 65లక్షల  నిధులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినట్టుగా తేలింది.
 
నకిలీ చెక్కులతో గతంలోనూ వేలు, లక్షల్లో నిధులు డ్రా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సచివాలయంలో దాదాపు గంటన్నరపాటు విచారణ చేసిన పోలీసులు.. ఇక్కడ ఉద్యోగుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రాథమిక విచారణ తర్వాత ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశముంది. మూడు రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల పాత్రపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఏసీబీ విచారణకు కూడా ఆదేశించినట్టు సమాచారం.