జిల్లాల పర్యటనలకు సీఎం జగన్.. నేడు తూర్పు గోదావరికి..

జిల్లాల పర్యటనలకు సీఎం జగన్.. నేడు తూర్పు గోదావరికి..

ఏపీ సీఎం జగన్‌ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ముమ్మిడివరం నియోజకవర్గంతో పాటు యానంలో జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ముమ్మిడివరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి... సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటం కోసం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం  కార్పొరేషన్ కార్యకలాపాల కారణంగా జిల్లాలో కొంతమంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. వారికి జీఎస్‌పీసీ ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం జరిగింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పాదయాత్రలో జగన్ బాధితులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.78.22 కోట్లు మత్స్యకారులకు చెల్లించనున్నారు. ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాల నిర్మాణం... ఎదుర్లంక... ఎస్సీలంక భూముల్లో 75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు సీఎం జగన్.
 
ముందుగా సీఎం జగన్ హెలికాప్టర్‌లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి  ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామానికి వెళ్తారు. పశువుల్లంక నుంచి వలసతిప్ప హైలెవల్ బ్రిడ్జి వైయస్సార్ వారధిని ప్రారంభిస్తారు. అప్పట్లో ఇక్కడే 20 మంది పిల్లలు చనిపోయారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిధులు విడుదలయ్యాయి. ముమ్మిడివరం మండలం కొమ్మానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్ కంట్రోల్ గదులకు జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి సీఎం జగన్‌ వెళతారు. ఆయనను పరామర్శించిన అనంతరం రాజీవ్‌ బీచ్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1గంటకు హెలికాఫ్టర్‌లో బయల్దేరి తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకుంటారు .