జంప్ జిలానీలపై జగన్ సెటైర్..

జంప్ జిలానీలపై జగన్ సెటైర్..

పార్టీ ఫిరాయింపులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపుతూ మాట్లాడిన సీఎం జగన్... ఇదే శాసన సభలో విలుల్లేని రాజకీయాలు చూశామన్నారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని రాజకీయాలు చేశారని గతంలో ఏపీ పాలించిన టీడీపీని ఉద్దేశించి జగన్ చెప్పుకొచ్చారు. అయితే తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదన్నారు. ఇదే సందర్భంలో పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. 23 మంది ఎమ్మెల్యేలే ఉన్న టీడీపీ నుంచి ఓ ఐదుగురును తీసుకుంటే ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండదని... కానీ, ఫిరాయింపులను ప్రొత్సహిస్తే చంద్రబాబుకు.. నాకు తేడా ఏమీ ఉండదన్నారు. 

సభా సంప్రదాయాలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్... ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని పరిస్థితి గతంలో కనిపించింది.. గత ప్రభుత్వం అనుసరించిన తీరుతో నేను ఎలా ఉండాలనే మీమాంస కలిగింది. కానీ, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుందన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ప్రొత్సహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చారు. ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోలేదు. ఫిరాయింపు చట్ట ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరినా పట్టనట్టు వ్యవహరించింది నాటి ప్రభుత్వమని మండిపడ్డారు. దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పది. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు.. 3 ఎంపీలను కొన్నారు.. అటువంటి పార్టీకు అన్నే సీట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు సీఎం జగన్. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.. బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తోందన్న ఆయన... విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే తమ్మినేని ఎన్నుకున్నాం. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే.. స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటుందని ప్రకటించారు. బీసీలకు పెద్ద పీట వేసే క్రమంలో తమ్మినేనిని స్పీకర్ ఛైరులో కూర్చొబెట్టామని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.