సచివాలయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

సచివాలయంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు... ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు... మీరు పూర్తిగా సహకరిస్తేనే ప్రజల, ప్రభుత్వ కల సాకారం అవుతుందన్నారు. మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందన్న సీఎం జగన్... ఈ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి ధృఢ సంకల్పంతో ఉన్నానని.. అవినీతిని నిర్ములించి, ప్రభుత్వానికి నిధులు ఆదా చేయాలని సూచించారు. అధికారులకు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలని.. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను సన్మాన సత్కారాలతో గౌరవిస్తానని.. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలని.. దానికి అందరికీ సహకారం కావాలని కోరారు సీఎం వైఎస్ జగన్. ఈ పాలనతో ఒక మార్పు కనపడాలి, ఒక వైవిధ్యం ఉండాలి. ప్రజలకు అత్యంత చేరువయ్యే పాలన ఉండాలి. మంచి అధికారులు ఉన్నారు. ఒక కుటుంబంగా మనమంతా కలిసి పని చేయాలి. 2024 లో ఎన్నికలకు వెళ్లే ముందు మనం నిరూపించి చూపాలి.. ఒక ఉత్తమమమైన పాలన అందించాలన్నదే నా ఆకాంక్ష అని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.