ఇంధనశాఖ కార్యదర్శి లేఖపై సీఎం జగన్ సీరియస్!

ఇంధనశాఖ కార్యదర్శి లేఖపై సీఎం జగన్ సీరియస్!

కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖను సీరియస్‌గా తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సమీక్షించాలని సీఎం జగన్ నిర్ణయించగా... పీపీఏల సమీక్ష మంచిది కాదంటూ ఏపీ సీఎస్‌కు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇలా చేయడం వల్ల పరిశ్రమలు రావని, పెట్టుబడి దారులు భయపడతారని లేఖలో పేర్కొన్నారు ఇంధన శాఖ కార్యదర్శి. పీపీఏలను సమీక్షిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలను టీవీల్లో, పేపర్లలో చూసి లేఖరాస్తున్నానని.. తన లేఖను సీఎం జగన్‌కు చూపించాలని సీఎస్‌కు సూచించారు ఇంధనశాఖ కార్యదర్శి. అయితే, ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ సీఎం.. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా.. ఇంధన కార్యదర్శి రాసిన లేఖను ప్రధానికి చూపించారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ... తప్పు జరిగినప్పుడు సమీక్షించడంలో తప్పేముందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరోవైపు, సాంప్రదాయేతర ఇంధన ధరలను గత ప్రభుత్వం ఎక్కువగా నిర్ణయించిందని ఆరోపిస్తున్నారు సీఎం జగన్.. మూడు, మూడున్నర రూపాయలు ఉండే యూనిట్ ధరను ఆరు రూపాయలకు పైగా పెంచి కొన్నారని సీఎం జగన్ ఆరోపించారు. మొత్తానికి, వెనక్కి తగ్గని ఏపీ సీఎం.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునర్ సమీక్షించనున్నారు.