బోటు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక అంశాల ప్రస్తావన..

బోటు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక అంశాల ప్రస్తావన..

దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు ఏపీ సీఎం.. ఘటన జరిగిన తీరును, చేపడుతున్న సహాయకార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్న ఆయన.. గోదావరిలో తిరుగుతున్న బోట్లు, లైసెన్సింగ్‌ విధానం, తనిఖీలు చేస్తున్న విధానం, ఇందులో శాఖలవారీగా బాధ్యతలపై అధికారులను నిశితంగా ప్రశ్నించారు. సమస్య మూలాల్లోకి వెళ్లి సమీక్షించారు. గోదావరిలో ఎన్ని ప్రభుత్వ బోట్లు ఉన్నాయని అధికారులను ప్రశ్నించిన సీఎంకు ఐదు బోట్లు ఉన్నాయని, వీటిని వరద కారణంగా నడపడంలేదని సమాధానమిచ్చారు. అయితే, ప్రభుత్వ బోట్లు నిలిపివేసినప్పుడు ప్రైవేటు బోట్లు ఎందుకు నడిపారని ఆస్పత్రిలో బాధితులు సూటిగా ప్రశ్నించారని, అధికారులు దీనికి ఏం సమాధానం చెప్తారని గట్టిగా మందలించారు. గత ఏడాది జారీచేసిన జీవో ప్రకారం కంట్రోల్‌ రూమ్స్‌ ఎందుకు పెట్టలేదని అధికారులను అడిగారు సీఎం.. బోటుకు కేవలం రిజిస్ట్రేషన్‌ ఇచ్చే అధికారం ఉంది.. కానీ, ఏ రూట్లో నడపాలో అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పారు అధికారులు. ప్రైవేటు బోట్లను అడ్డుకునే అధికారం టూరిజం అధికారులకు లేనప్పుడు నీటిపారుదల శాఖకు ఆపే అధికారం ఉందికదా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. 

కంట్రోల్‌రూమ్స్‌ ఉండాలంటూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.. ముఖ్యమైన పాయింట్ల వద్ద కంట్రోల్‌రూమ్స్‌ పెట్టాల్సి ఉండగా.. ఎందుకు పెట్టలేదని నిలదీశారు. అసలు నియంత్రణా వ్యవస్థే కనిపించడం లేదు, కేవలం నామ మాత్రంగా ఉంది, అన్నీ జీవోలకే పరిమితమయ్యాయని ఆందోళన వ్యక్తం  చేశారు. ప్రభుత్వ బోట్లు ఓవైపు ఆగి ఉన్నాయని తెలిసినా కూడా ప్రైవేటు బోట్లను పోలీసులు కూడా ఎందుకు అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటు దగ్గరకు పోలీసులు వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీశారు, మద్యం ఏమైనా ఉందా? అని తనిఖీలు చేశారు.. కానీ, ప్రభుత్వ బోట్లు తిరగలేదు కాబట్టి, ప్రయివేటు బోట్లు కూడా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. పోలీసు అధికారులు, నీటిపారుదల అధికారులు, టూరిజం అధికారులతో కూడిన కంట్రోల్‌ వ్యవస్ధ పెట్టాల్సి ఉండగా పెట్టలేదు..  అసలు శాఖల మధ్యే సమన్వయంలేదని విషయం బయటపడిందన్నారు సీఎం జగన్. ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉంది, మొత్తం వ్యవస్థను మార్చాలన్న ఆయన.. బోట్లకు లైసెన్స్‌ ఇచ్చే మెకానిజం ఏంటన్నది పరిశీలించాలన్నారు. తక్షణమే కంట్రోలు రూమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసులు, ఇరిగేషన్, టూరిజం, పోర్టు విభాగాలు సమన్వయంతో కంట్రోల్‌ రూం ఏర్పాటు కావాలన్నారు. 

ఆస్పత్రిలో బాధితులను చూసినప్పుడు నాకు చాలా బాధ వేసిందన్నారు సీఎం జగన్.. మనం అంతా ఏంచేస్తున్నామనిపిస్తోంది. అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే బోటును ఆపగలిగే అవకాశం ఉన్నా.. ఆపలేకపోయాం. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలన్నారు. ఇక చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించామని.. అంతేకాదు గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున, ఘటననుంచి బయటపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. వారికి సహాయం తక్షణం అందేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. జరిగిన ఘటనలో మన బాధ్యత ఉంది కాబట్టి ఈ పరిహారం ఇస్తున్నాం,  మనం తప్పుచేశాం కాబట్టి.. ఈ పరిహారాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. ఇకపై ఇలాంటి తప్పులు జరక్కూడదు. బోటు ప్రమాద ఘటనపైన, ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని వేస్తున్నామన్నారు. ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు. స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ రెవిన్యూ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషన్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీలో ఉంటారని తెలిపారు.