'పోలవరం' కుంభకోణంతో నిండిపోయింది!

'పోలవరం' కుంభకోణంతో నిండిపోయింది!

ఏపీ అసెంబ్లీలో పోలవరంపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గత మూడు రోజుల నుంచి ఏదో రూపంలో పోలవరంపై చర్చ జరుగుతూనే ఉందన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుని గత ప్రభుత్వం పూర్తిగా కుంభకోణంతో నింపేసిందని సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలను నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని.. స్పిల్ వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారని.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం పోలవరం పనులు జరగడం లేదన్నారు. వరద ముంపు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కాపర్ డ్యామ్ పనులు కూడా ఆగాయన్న సీఎం వైఎస్ జగన్.. అందరి కళ్ల ముందే ఈ వివరాలన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాం. నవంబర్ నెల నుంచి పోలవరం పనులు తిరిగి ప్రారంభం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. జులై 2021 నాటికి పోలవరం నుంచి నీళ్లిస్తామని స్పష్టం చేశారు. 

నిపుణుల కమిటీ తప్పిదాలు.. అవకతవకలు నిర్దారించాక రివర్స్ టెండరింగ్ పిలుస్తామని మరోసారి ప్రకటించిన సీఎం జగన్.. పోలవరం పనుల్లో సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో నామినేషన్ పద్ధతిన టెండర్లు కట్టబెట్టారని.. మాజీ మంత్రి యనమల వియ్యంకుడుకు పనులు ఇచ్చారని.. పవర్ ప్రాజెక్టు పనులను తమకు కావాల్సిన నవయుగకు కట్టబెట్టారని మండిపడ్డారు. మొబలైజేషన్ అడ్వాన్సుల రూపంలో నవయుగకు రూ. 724 కోట్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. మరో 15-20 రోజుల్లో నివేదిక వస్తుంది.. మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. రూ. 6 వేల కోట్ల పనుల్లోనే గత సర్కార్ సుమారు రూ. 1500 కోట్ల అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు.