రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్...అందుకే !  

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్...అందుకే !   


ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే అంతరాష్ట్ర స్ధాయి సంఘం సమావేశంలో జగన్ పాల్గొంటారు. రాజధాని అమరావతి, పోలవరం రివర్స్ టెండరింగ్ పై జగన్ కేంద్రమంత్రులతో ఆయన సమావేశమౌతారని చెబుతున్నారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చెక్ పడింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్రస్దాయిలో దాడికి దిగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

పోలవరంలో రివర్స్ టెండరింగ్ పై కేంద్రం మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పాత కాంట్రాక్టులు రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలిచింది. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ప్రభుత్వ వైఖరి కేంద్రమంత్రులు అమిత్ షా, షెకావత్ కు వివరించాలని జగన్ డిసైడైనట్టు చెబుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర పరిధిలోని అంశాలను కూడా అమిత్ షా తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన హామీలపై పలువురు మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు. 

Ntv Desk