కోచ్‌లను కొనసాగించం: బీసీసీఐ

కోచ్‌లను కొనసాగించం: బీసీసీఐ

విదేశీ టెస్ట్ సిరీస్‌లలో అద్భుతంగా రాణించిన టీంఇండియా స్వదేశంలో మాత్రం తేలిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో ఫేవరేట్ గా దిగుతోన్న టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. అయితే రెండు సిరీస్‌లలో భారత ప్రదర్శన మాత్రం బాగానే ఉంది. మరోవైపు ఐపీఎల్ సీజన్ -12 అనంతరం ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ జరగనుంది.

ప్రపంచకప్‌ చివరి మ్యాచ్‌తో హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. అయితే ప్రపంచకప్‌లో టీమిండియా విజయం సాధిస్తే రవిశాస్త్రిని మరలా కొనసాగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. 'టీమిండియా ప్రపంచకప్‌ గెలిచినా.. కోచ్‌ రవిశాస్త్రిని కొనసాగించం. రవి మళ్లీ ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సిందే. రవి మాత్రమే కాదు.. మిగతా సిబ్బంది సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్‌లకు కూడా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే ముందే ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌ చేరితేనే రవిశాస్త్రి మళ్లీ కోచ్‌గా పదవి చేపట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి' అని సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు.