విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం...పలువురికి తీవ్రగాయాలు 

విశాఖ పోర్టులో భారీ అగ్నిప్రమాదం...పలువురికి తీవ్రగాయాలు 

విశాఖ సముద్ర తీరంలోని విశాఖపట్నం ఓడరేవులోని ఓ నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ హార్బర్‌లో ఉన్న నౌక ‘జాగ్వార్‌ టగ్‌’లో ఈ ఉదయం 11.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 29 మంది సిబ్బంది వేరే దారి లేక సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ అప్పటికే వీరిలో చాలా మంది మంటల్లో కాలడం వలన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం అందుతోంది. ఔటర్ హార్బర్‌లో సివిల్ పనుల కోసం సిబ్బందిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురయిన జాగ్వార్ నౌకను పోర్ట్‌ పనుల కోసం విశాఖ హార్బర్‌ అధారిటీ అద్దెకు తీసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 29 మంది ఉన్నట్లు అధికారుల నుండి సమాచారం అందుతోంది. ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. 16 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, వారిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా హార్బర్‌ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. అయితే సముద్రంలోకి దూకిన ఒక వ్యక్తి గల్లంతవగా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. భారీ నౌకలను పోర్టు బెర్తుల మీదికి చేర్చటానికి, తిరిగి సముద్రంలోకి తీసుకు వెళ్లడానికీ, ఓడల నుంచి సరుకులను తెచ్చేందుకు ఈ టగ్ లను వాడతారని నిపుణులు చెబుతున్నారు.