మరో రెండు రోజుల పాటు చలిగాలులు 

 మరో రెండు రోజుల పాటు చలిగాలులు 

దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఆదివారం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4.6 డిగ్రీ సెల్సియస్ కు పడిపోయింది. చలి గాలులు మరో రెండు రోజుల వరకు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం నిర్మలంగానే ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. పంజాబ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు చలిగాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, మిగిలిన కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పంజాబ్‌తో పాటు ఉత్తర, పశ్చిమ రాజస్తాన్‌లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పొగ మంచు మరో మూడు లేదా నాలుగు రోజుల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు పొగమంచు కారణంగా ఉత్తర భారత దేశంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి బయలుదేరే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.