టీ20 వరల్డ్ రికార్డు: ఏడు వికెట్లు తీసి...

టీ20 వరల్డ్ రికార్డు: ఏడు వికెట్లు తీసి...

టీ-20 క్రికెట్ అంటేనే బ్యాటింగ్‌తో చెలరేగిపోవడం.. ఈ పొట్టి క్రికెట్ పార్మాట్ వచ్చిన తర్వాత.. భారీ స్కోర్ చేయడం.. ప్రత్యర్థి జట్టు పెట్టిన భారీ టార్గెట్లను సైతం సులువుగా ఛేదించడం చూస్తున్నాం. కానీ, దక్షిణాఫ్రికా క్రికెటర్, లీసెస్టర్‌షైర్ కెప్టెన్ కొలిన్ అకర్‌మన్న్ మాత్రం తన బౌలింగ్‌తో వరల్డ్ రికార్డు సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో ఏకంగా ఏడు వికెట్లు తీసి కొత్త రికార్డు నెలకొల్పాడు. బర్మింగ్‌హామ్‌‌ బేర్స్‌, లీసెస్టర్‌షైర్‌ ఫాక్సెస్‌ మధ్య జరిగిన కౌంటీ క్రికెట్‌ టీ20లీగ్‌ ఈ వరల్డ్ రికార్డుకు వేదికైంది. కొలిన్‌ కేవలం 18 పరుగులిచ్చి ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో టీ-20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. కాగా, 2011లో మలేసియా బౌలర్‌ అరుల్‌ సుప్పయ్య.. ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి.. ఆరు వికెట్లు తీసి రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును ఇప్పుడు కొలిన్ బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్‌ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేయగా.. అనంతరం కొలిన్‌ చెలరేగడంతో బర్మింగ్‌హామ్‌ జట్టు 17.4 ఓవర్లలో 134 పరుగులకు పెవిలియన్ చేరింది.